19 సంవత్సరాల అర్జీ నేడు పరిష్కారం.

 


 19 సంవత్సరాల అర్జీ నేడు పరిష్కారంమచిలీపట్నం జూన్ 19 (ప్రజా అమరావతి):---

గత 19 సంవత్సరాలుగా పంట నష్టపరిహారం కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్న రైతుకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.   


సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో స్పందన కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు15 వేల రూపాయల చెక్కును రైతు  బసవపూర్ణయకు అందజేశారు.


వివరాల్లోకెళితే


మోపిదేవి మండలం కోసూరు వారి పాలెం గ్రామానికి చెందిన రైతు భోగిరెడ్డి బసవపూర్ణయ్య  2004 లో ఆరు ఎకరాలలో బంగాళా దుంప, కాకర పందిరి, వంగ వంటి పంటలు వేసి వర్షా కాలంలో కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న గా ఆ పంటకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ అప్పటినుంచి ఉద్యాన శాఖకు, కలెక్టర్ కు,  ముఖ్యమంత్రి కార్యాలయంకు పలుసార్లు అర్జీలపై అర్జీలు పెడుతూ వస్తున్నారు. ఆ వర్షాలు తుఫాను వల్ల  కానీ, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కానీ కావు. ప్రకృతి వైపరీత్యం కాదు కనుక అందుకు  సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ వర్తించదని పలుసార్లు శాఖా పరంగా వారికి సమాధానం ఇచ్చినా అతను సంతృప్తి చెందక  ప్రస్తుత కలెక్టర్ పి రాజాబాబును కలిసి స్పందన లో అర్జీ ఇచ్చారు. కలెక్టర్  కూడా అతనితో మాట్లాడుతూ ఈ పంట నష్టం అనేది ప్రకృతి వైపరీత్యం కి మాత్రమే వర్తిస్తుంది కానీ వర్షాకాలంలో వచ్చిన వర్షాలకు కాదని తెలిపినప్పటికీ  అర్జీదారు గత  19 సంవత్సరాలుగా పలుమార్లు ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ మళ్లీ మళ్లీ నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారని జిల్లా కలెక్టర్ మానవత్వంతో ప్రత్యేక విషయంగా పరిగణించి అతనితో మాట్లాడి రు. 15000/- (పదిహేను వేల రూపాయలు) బ్యాంకు చెక్ ను  అందించి ఆదుకున్నారు. అందులకు ఆ రైతు ఎంతగానో సంతోషించి జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డిఓ కిషోర్, జిల్లా ఉద్యాన అధికారి జే. జ్యోతి తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments