ఆంధ్ర కర్ణాటక సరిహద్దు మోకా సమీపంలోని 'హగరి అక్వడిక్ట్' పనుల పరిస్థితిని సమీక్షించిన ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులు.



*ఆంధ్ర కర్ణాటక సరిహద్దు మోకా సమీపంలోని 'హగరి అక్వడిక్ట్' పనుల పరిస్థితిని సమీక్షించిన ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులు


*


*వర్షాల నేపథ్యంలో త్వరితగతిన పనుల పూర్తికి ఆదేశాలిచ్చిన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం*


కర్నూలు, జూన్, 12 (ప్రజా అమరావతి): ఆంధ్ర కర్ణాటక సరిహద్దు మోకా సమీపంలోని హగరి నది వద్ద అక్వడిక్ట్ వద్ద సాగుతున్న పనుల ప్రస్తుత పరిస్థితిని ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం పరిశీలించారు. ఇటీవల వర్షాలు, వరదల అనంతరం నది వద్ద  ఏర్పాటు చేసిన తాత్కాలిక పిల్లర్లను పరిశీలించారు. ఎగువన వర్షాలు,వరదల కారణంగా కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా బదినేహళ్ గ్రామ సమీపంలో వేదవతి నదిపై 700 మీటర్ల బ్రిడ్జి ఎల్ఎల్ సి కెనాల్ లోని బ్రిడ్జి నందు ఉన్న 15వ పిల్లర్ వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందని  తుంగభద్ర బోర్డు ఎస్.ఈ శ్రీకాంత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నీలకంఠ రెడ్డి వివరించారు. రైతుల పంటలకు , సాగు నీటికి ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆ పిల్లర్లను మంత్రులిరువురు కలిసి పర్యవేక్షించారు. వాణి విలాస సాగర ప్రాజెక్టు పూర్తిగా నిండడం,  వరద ప్రవాహం, ఆ కారణంగా భైరవాని తిప్ప ప్రాజెక్టు నిండడం, హగరిలో సామర్థ్యానికి మించి నీరు వచ్చిన సమయంలో అధికారులు స్పందించి రైతులకు నష్టం కలగకుండా పంటల్ని కాపాడిన తీరును  అధికారులు మంత్రులకు వివరించారు.


ఖరీఫ్ పంట అనంతరం శాశ్వత మరమ్మతులను 9 నుంచి 16 స్తంభాల వరకు ప్రారంభించి ఇప్పటికే 75 శాతం పనులను పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. అయితే వర్షాకాలం నేపథ్యంలో మిగతా పనులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన ఆదేశించారు.ఎల్ఎల్ సి కెనాల్ నిర్మాణం చేపట్టి కర్ణాటకతో పాటు ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాలకు సాగు, త్రాగునీరు అందించే ఏకైక జీవనాడిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి,జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, తుంగభద్ర బోర్డు ఎస్.ఈ శ్రీకాంత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నీలకంఠ రెడ్డి,  ఇరిగేషన్ శాఖ కర్నూలు సూపరింటెండెంట్ ఇంజనీర్ రెడ్డి శేఖర్ రెడ్డి, తుంగభద్ర ప్రాజెక్టు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.శైలేశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments