స్పందన అర్జీల పట్ల ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలిమచిలీపట్నం జులై 10 (ప్రజా అమరావతి):


స్పందన అర్జీల పట్ల ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని


జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్  జిల్లా అధికారులను ఆదేశించారు.


సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ కిషోర్ లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి పలు ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.


ఈ సందర్భంగా సంయుక్త  కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించారు.   సంబంధిత అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.


జిల్లా అధికార యంత్రాంగం స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి. 


గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు హరీష్ తదితరులు మాట్లాడుతూ తాము  గన్నవరంలోని బీసీ వసతి గృహం లో ప్రస్తుతం ఉంటున్నామని ఆ వసతి గృహం శిథిలావస్థలో ఉన్నందున తక్షణమే ఖాళీ చేయాలని చెప్పారని తమలాంటి పేదరికంలో ఉన్న కుటుంబాలు ప్రైవేటు వసతి గృహాల్లో ఉండాలంటే చాలా కష్టమని తమకు ప్రత్యామ్నాయంగా వసతి కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు.


గుడివాడ మండలం మోటూరు గ్రామ రైతులు కే నాగరాజు తదితరులు మాట్లాడుతూ  రీ సర్వే నంబరు 320/1లోని  బుక్కావారి చెరువు ఆనుకుని ఉన్న పంచాయతీకి సంబంధించిన భూమిని కొందరు ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా చెరువును త్రవ్వి అక్రమంగా మట్టి అమ్ముకుంటున్నారని ప్రక్క పొలాల రైతులమైన తాము స్థానిక తహసిల్దారు, పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన ఫిర్యాదులు తీసుకోకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని, ఆక్రమించిన చెరువు పైన ఉప్పునీరు బోరు వేసి చెరువులో నీరు పట్టి రొయ్యల సాగు చేసేందుకు సిద్ధమయ్యారని దీంతో పక్కనున్న 70 ఎకరాల రైతుల భూములు చవుడుగా మారి పంటలు పండే అవకాశం లేకుండా పోతుందని ప్రజలు త్రాగే మంచినీళ్లు  మురికినీరుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ అర్జీని అందజేశారు.


మోపిదేవి మండలం పెదకల్లేపల్లి గ్రామం వైఎస్ఆర్ కాలనీ కాపురస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు  రెండు సెంట్లు భూమి ఇచ్చిందని, తమ నివాసం వెనుక వైపు మాగాణి పొలం గల అరభాపాండు, గోళ్ళ వెంకటేశ్వరరావు తమ గృహాల పునాదులకు ఇబ్బంది కలిగే విధంగా బోది తవ్వినారని ఇదివరకు బోదలు లేవని ఆ పంట బోధిని పూడ్పించి తమకు నష్టం కలగకుండా చూడాలని విజ్ఞాపన పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంయుక్త   కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ స్పందన అర్జీల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో పరిష్కరించాలన్నారు.


ఈ కార్యక్రమంలో  జెడ్పీ సీఈవో జ్యోతిబసు, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, డిపిఓ నాగేశ్వర్ నాయక్, డీఎస్ఓ పార్వతి, ముడా విసి రాజ్యాలక్ష్మి, డిఎంహెచ్వో డాక్టర్ గీతా బాయి, డిఈఓ తేహెరా సుల్తానా, జిల్లా ఉద్యాన అధికారి జె .జ్యోతి, జిల్లా ఎంఐపి అధికారి విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, జిల్లా ఆర్ అండ్ బి అధికారి శ్రీనివాస్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Comments