సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు


ఈ ఏడాది రూ.1486 కోట్ల అదనపు కేటాయింపు

పూర్తి స్థాయిలో నిధులను వినియోగించండి

ప్రభుత్వశాఖలకు మంత్రి మేరుగు నాగార్జున ఆదేశం

అమరావతి, ఆగష్టు 31 (ప్రజా అమరావతి): గత ఏడాది కంటే 10 శాతం అధికంగా ఈ ఏడాది ఎస్సీ కాంపోనెంట్ (సబ్ ప్లాన్)లో భాగంగా ఎస్సీల సంక్షేమానికి రూ.20005.22 కోట్ల ను ప్రభుత్వం కేటాయించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీల అభ్యున్నతి కోసం కేటాయించిన ఈ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ శాఖ కూడా సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకొనేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు.

రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 31వ ఎస్సీ కాంపోనెంట్ నోడల్ ఏజెన్సీ సమావేశంలో నాగార్జున మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్త ఆలోచనలతో పరిపాలన చేస్తున్నారని అందులో భాగంగానే ఎస్సీల సమగ్రాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, దీనికి అవసరమైన నిధులను కూడా ఎక్కువ స్థాయిలో ఇస్తున్నారని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధుల కంటే ఈ ఏడాది రూ.1486.93 కోట్లు అధికంగా మంజూరు చేసారని తెలిపారు. ప్రస్తుతం ఈ నిధుల్లో రూ.9201.93 కోట్ల రుపాయలు గత జూలై నెలాఖరు నాటికి ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో ప్రధానమైన 42 ప్రభుత్వ శాఖలు ఎస్సీ కాంపోనెంట్ లో భాగంగా చేపట్టిన వివిధ పథకాలు, వాటికి వ్యయం చేసిన నిధుల వివరాలను మంత్రి నాగార్జున సమీక్షించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఈ సందర్భంగా ఎస్సీ కాంపోనెంట్ కింద తాము నిధులను వెచ్చించిన తీరును వివరించగా, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ ప్రవీణ్ ప్రకాష్ తమ శాఖలో ఎస్సీ కాంపోనెంట్  నిధుల వినియోగాన్ని పీపీటీ ద్వారా వివరించారు. ప్రవీణ్ ప్రకాష్ ఎస్సీ కాంపోనెంట్ నిధుల వినియోగానికి సంబంధించి సవివరంగా వివరించిన తీరు బాగుందని నాగార్జున అభిప్రాయపడ్డారు. మిగిలిన శాఖలు కూడా ఇదే విధంగా తమ శాఖల్లో ఎస్సీ కాంపోనెంట్ నిధుల వినియోగాన్ని నోడల్ ఏజెన్సీ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా నిధులను ఖర్చు చేయడంలో ఎక్కువ ప్రభుత్వ శాఖలు ముందంజలో ఉన్నాయని, అయితే కొన్ని శాఖలు ఎస్సీ సంక్షేమ నిధుల వినియోగాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం ద్వారా ఎస్సీల ప్రగతికి చేయూతనివ్వాలని నాగార్జున కోరారు. ఎస్సీ కాంపోనెంట్ కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ ను ఆయా శాఖలు విశ్లేషించుకోవాలని, ఏదైనా పథకానికి అదనంగా బడ్జెట్ అవసరమైతే వాటికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా నోడల్ ఏజెన్సీకి అందించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే నోడల్ ఏజెన్సీ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి అధికారులు హాజరు కావాలని నాగార్జున ఆదేశించారు. ప్రస్తుత నోడల్ ఏజెన్సీ సమావేశానికి గైర్హాజర్ అయిన శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించాలని సాంఘిక సంక్షేమశాఖ అధికారులను నాగార్జున ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ స్పెషల్ సీఎస్ ప్రవీణ్ ప్రకాష్, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.జయలక్ష్మి, ఇంచార్జ్ డైరెక్టర్ కే. హర్షవర్ధన్, ఎస్సీ కార్పొరేషన్ వీసీ ఎండీ చిన్నరాముడు, ఎస్సీ గురుకులాల కార్యదర్శి ఆర్.పావనమూర్తి తో పాటుగా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments