అరకు కాఫీని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు .

 అరకు కాఫీని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు 


స్థానికంగా అరకు కాఫీ ప్రొసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రాజెక్టు నివేదిక పంపండి

ఆహారశుద్ధి శాఖ సమన్వయంతో పలు యూనిట్లు ఏర్పాటు చేసేలా చూడాలి

టాటా వంటి సంస్థలతో మార్కెటింగ్ టైఅఫ్ కు చర్యలు తీసుకోవాలి

                    ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,22 నవంబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలోని అరకు ప్రాంతంలో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగు చేస్తున్న అరకు కాఫీనీ పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి పేర్కొన్నారు.అరకు కాఫీ సాగు,మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ అరకు కాఫీ ఎంత విస్తీర్ణంలో సాగు అవుతుంది దానికి గల మార్కెటింగ్ సౌకర్యాలు,కాఫీ పండ్లను కాంఫీ గింజలుగా తదుపరి కాఫీ పౌడర్ గాను ఇతర ఉత్పత్తులుగాను ప్రోసెస్ చేసేందుకు ఆప్రాంతంలో ఉన్నసదుపాయాలను ఆయన ఆరా తీశారు.అంతేగాక ఏడాదికి ఎంత మొత్తం కాఫీ ఉత్పత్తి జరుగుతోంది,వాటికి ఏమేరకు ధర వస్తోంది వంటి అంశాలను అధికారులను అడిగి తెల్సుకున్నారు.అలాగే కాఫీ ఉత్పత్తికి సంబంధించి కాఫీ బోర్డు పాత్ర ఏమిటి పంటను కొనుగోలు చేస్తుందా,మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంలో దాని పాత్ర ఏమిటి వంటి అంశాలను ఈసమావేశంలో చర్చిచాంరు.రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీని మరింత పెద్దఎత్తున ప్రోత్సహించడం ఇంకా అధిక విస్తీర్ణంలో సాగుచేసేందుకు వీలుగా గిరజన ప్రాంత రైతులను అన్నివిధాలా ప్రోత్సహించడం వారికి తగిన తోడ్పాటును అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాయలసీమ ప్రాంతంలో వేరుశెనగ,టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసిన విధంగానే కాఫీ పంటను ప్రోసెస్ చేసేందుకు వీలుగా స్థానికంగా ఒక మెగా ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు తక్షణం ఒక ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.పండించిన పంటను జాతీయ అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసేందుకు టాటా వంటి పలు బహుళజాతి సంస్థలతో టైఅప్ చేసేందుకు చర్యలు చేపట్టాలని సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.

సమావేశంలో ప్రకృతి వ్యవసాయ ఇఓ కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ అరకు కాఫీకి జాతీయ,అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే విధంగా వివిధ సంస్థలతో మాట్లాడడం జరుగుతుందని చెప్పారు.అలాగే స్థానికంగా ఒక మెగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు వెంటనే ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.రాష్ట్ర నైపుణ్య శిక్షణాసంస్థ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ మాట్లాడుతూ అరకు కాఫీ మార్కెటింగ్,ఇతర అంశాల్లో స్థానిక గిరిజన యువతకు శిక్షణ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అంతకు ముందు అల్లూరి సీతారామరాజు జిల్లా కలక్టర్ సుమీత్ కుమార్ వీడియో లింక్ ద్వారా అరకు కాఫీ సాగు,విస్తీర్ణం,ప్రొసెసింగ్,మార్కెటింగ్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చేస్తూ ప్రస్తుతం లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అరకు కాఫీని సాగు చేస్తున్నట్టు తెలిపారు.ఐటిడిఏ ద్వారా నర్సరీల్లో కాఫీ మొక్కలను పెంచి వాటని గిరిజన రైతులకు పంపిణీ చేసి కాఫీ సాగు చేస్తుండగా ప్రస్తుతం 11 మండలాల్లో అరకు కాఫీ సాగవుతోందని జిసిసి ద్వారా గిరిజన రైతుల నుండి పంటను కొనుగోలు చేయడం వాటని రాష్ట్ర వ్యాప్తంగా రిటైల్ మార్కెటింగ్ స్టోర్లు ద్వారా ఫ్యాకెట్లు,డబ్బాలు తదితర రూపాల్లో విక్రయించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద కాఫీని గుర్తించి అన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

కాగా రాష్ట్రంలో అరకు కాఫీ సాగు చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖపట్నం జిల్లాలోని రక్షిత అటవీ ప్రాంతంలో 10వేల 100 ఎకరాల్లో కాఫీ పంటను అభివృద్ధి చేయగా కాఫీ తోటల్ని1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పగించారు.1956లో గిరిజన సహకార సంస్ధ ఏర్పాడ్డక కాఫీ బోర్డు వారు ఈసంస్ధని కాఫీ తోటల అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని ఉద్దేశించారు.ఆరకంగా గుర్తింపబడి గిరిజనుల ద్వారా కాఫీ తోటల పెంపకంలో గిరిజన సహకార సంస్థ కృషి చేయడం మొదలైంది.1975 నుంచి 1985 వరకు జిసిసిలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృది విభాగం పనిచేస్తూ సుమారు 4000 హెక్టర్ల కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో ప్రారంభమైంది.అరకులో తయారయ్యే అర్గానిక్ కాఫీ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది.2003 నుంచి 2012 మధ్యకాలంలో అంటే పదేళ్ళలో విశాఖ కాఫీ ఏడుసార్లు రీజినల్ స్థాయి అవార్డులు పొందింది.జీకేవీధి,చింతపల్లి,పెదబయలు, మినుములూరు,అనంతగిరి, అరకులోయ తోటల్లో సాగయిన కాఫీ గింజలు నాణ్యమైనవనిగా కాఫీ పంట నిపుణులు తేల్చారు.2007లో ఆదివాసీ రైతులు ఉత్పత్తి చేసిన అరకు భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్.ప్రపంచంలో కొన్నిఅత్యుత్తమ కాఫీ తోటలు అరకులోయలో కనిపిస్తాయి.రుచికరమైన కప్పు కాఫీ కోసం ఎంత దూరమైనా వెళ్లే వారికి ఇది సరైన ప్రదేశం.సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం.ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ పొడవాటి మిరియాలు సిల్వర్ ఓక్ చెట్ల మధ్యలో సాగవుతాయి.ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు.అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు. దీని వలన చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది.సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం కూడా కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది.

భారతదేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుండగా అందులో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక,తమిళనాడు,కేరళ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ లో అరకు ప్రాంతంలో అరబికా రకం కాఫీని పండిస్తున్నారు.ప్యారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్‌ పేరుతో 2017లో కాఫీ షాప్‌ తెరిచారు.భారతదేశం వెలుపల ఏర్పాటైన మొట్టమొదటి 'అరకు కాఫీ' షాప్ ఇది.నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ దీన్ని ప్యారిస్ లో ఏర్పాటు చేసింది.ఆ తర్వాత అరకు కాఫీ రుచులు జపాన్, దక్షిణ కొరియా,స్విట్జర్లాండ్‌ దేశాలకూ పాకాయి.2018లో పారిస్ లో జరిగిన ప్రిక్స్ ఎపిక్యూర్స్-2018 పోటీలో (Prix Epicures) అరకు కాఫీ గోల్డ్ మోడల్ గెల్చుకుంది.రుచికరమైన కాఫీ బ్రాండులకి పేరుపొందిన బ్రెజిల్,సుమత్రా,కొలంబోతో పాటు ఇతర దేశాలను వెనక్కి నెట్టి అరకు కాఫీ బంగారు పతకాన్ని పొందడం విశేషం.సేంద్రీయ పద్ధతుల్లో అరకు కాఫీని పండిస్తారు.కాఫీ మొక్కల నుంచి రాలిపడే ఆకులనే వాటికి మళ్లీ ఎరువుగా వేస్తూ మిరియాలు,సిల్వర్ ఓక్ వంటి చెట్ల నీడలో వీటిని పెంచుతారు.ఈ తోటల్లో పనిచేసే కూలీలకు ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది.కాఫీ మొక్కకు వచ్చే పిక్కను మూడు దశల్లో పరిశీలిస్తూ ఎర్రగా చెర్రీ ఫ్రూట్ రంగులోకి మారిన వాటిని మొక్క నుంచి వేరు చేస్తారు.ఎర్రగా మారిన కాఫీ పిక్కలను ఎప్పటికప్పుడు వేరు చేస్తూవాటిని ప్రాసెసింగ్ కోసం పంపిస్తారు.ఈ గింజలను ఏపీఎఫ్‌డీసీ కొనుగోలు కొందరు కాఫీ రైతులు స్వయంగా తమ సొంత యూనిట్లతో కాఫీ పొడిని తయారు చేస్తుంటారు.అనంతరం పావు కిలో అరకిలో ప్యాకెట్లుగా తయారు చేసి రిటైల్ గా అమ్మకాలు చేస్తుంటారు. 

ఈసమావేశంలో గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ జె.వెంటక మురళి పలువురు గిరిజన సంక్షేశాఖ అధికారులు పాల్గొనగా వీడియో లింక్ ద్వారా జిసిసి విసి అండ్ ఎండి సురేశ్ కుమార్,పార్వతీపురం మన్యం జిల్లా కలక్టర్ నిశాంత్ కుమార్,రాష్ట్ర ఆహారశుద్ధి సంస్థ సిఇఓ ఎల్.శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments