ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయండి.

 ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయండి


ప్రభుత్వ వెబ్ సైట్లలో ప్రజా ప్రతినిధుల ఫోటోలు,ఆడియో వీడియోలు తొలగించండి

ప్రభుత్వ కార్యాలయాలన్నిటిలో ప్రజా ప్రతినిధుల పొటోలు తొలగించండి

ప్రభుత్వ ఆస్తులపై రాజకీయపరమైన ప్రకటనలు తక్షణం తొలగించాలి

ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు 

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించండి

   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,19 మార్చి (ప్రజా అమరావతి):రాష్ట్రంలో రానున్నసాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్నిఆదేశించారు.మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు.ముఖ్యంగా ప్రభుత్వ వెబ్ సైట్లన్నిటిలో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన పొటోలు,ఆడియో,వీడియోలు వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అదే విధంగా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన పొటోలను,ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు.ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయపరమైన ప్రకటనలన్నీ తొలగించాలని ఆదేశించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఏశాఖ పైనైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి కార్యదర్శులకు స్పష్టం చేశారు.ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే అలాంటి వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యల తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని అన్నారు.చాలా వరకు కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళనున్నందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పూర్తి స్పష్టత ఉండేలా ఈమార్గదర్శకాలను పూర్తిగా చదివి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి సిఇఓ ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్ లో నివేదిక ఇవ్వాలని అందరు కార్యదర్శులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

ఈసమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను వివరిస్తూ ఎన్నికల షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కొత్త పధకాలు ప్రకటించడానికి వీలులేదని స్పష్టం చేశారు.బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు,పధకాలు,రాయితీలు,గ్రాంట్లు మంజూరు,హామీలు,శంఖు స్థాపనలు పూర్తి నిషేధమని సిఇఓ స్పష్టం చేశారు.వర్క్ఆర్డర్ ఉన్న కేత్ర స్థాయిలో పనులు మొదలు కాని పనులు చేపట్ట కూడదని తెలిపారు‌.పనులు పూర్తయిన వాటికి నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు.వివిధ రకాల ఫించన్లు పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు.కోడ్ అమలులోకి వచ్చాక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పధకాలు,కార్యక్రమాలపై సమీక్షలు లేదా వీడియో సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం కింద వివిధ రిజిష్టర్డ్ లబ్దిదారులకు యదావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చని చెప్పారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందు ఏవైనా పనులకు సంబంధించి టెండర్లు పలిచి ఉంటే ఆప్రక్రియను కొనసాగించుకోవచ్చని కాని టెండర్లను ఖరారు చేయడానికి వీలులేదని సిఇఓ మీనా కార్యదర్శులకు స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు,పోస్టర్లు,కటౌట్లు,హోర్డింగులు,బ్యానర్లు,జెండాలు వంటివన్నీ తొలగించాలని చెప్పారు.అలాగే వివిధ పబ్లిక్ ఆస్థులు అనగా బహిరంగ ప్రదేశాలు,బస్ స్టాండ్ లు,రైల్వే స్టేషన్లు,రైల్వే,రోడ్డు వంతెనలు,ప్రభుత్వ బస్సులు,విద్యుత్ స్తంభాలు,మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్లు,వాల్ రైటింగులు, పోస్టర్లు,కటౌట్లు వంటివన్నిటినీ షెడ్యూల్ వెలువడిన 48గంటల్లో తొలగించాలని సిఇఓ స్పష్టం చేశారు.అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లను నిలిపి వేయాలని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం వినియోగించరాదని స్పష్టం చేశారు.ఎంపి లేదా ఎంఎల్ఏ నిధులు లేక ఇతర ప్రభుత్వ పధకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు,అంబులెన్సులు వంటి వాటిపై ఎంపి,ఎంఎల్ఏలు వంటి ప్రజా ప్రతినిధుల ఫొటోలు ఉండరాదని సిఇఓ మీనా స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు,కార్యాలయిల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదని తెలిపారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక విద్యుత్,నీటి బిల్లులు,బోర్డింగ్ పాస్ లు,వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు,సందేశాలు వంటివి ఉండరాదని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.అలాగే పియం,సియం సహాయ నిధి కింద గుండె,కిడ్ని,కేన్సర్ వంటి రోగులకు అత్యవసర చికిత్సలకై  సకాలంలో నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

సద్భావనా దివస్,గాంధీ జయంతి వంటి జాతీయ ప్రాముఖ్యతా దినోత్సవాల వేడుకల్లో కేంద్ర మంత్రులు,ముఖ్యమంత్రి,రాష్ట్ర మంత్రులు వంటి ప్రజా ప్రతినిధులు పాల్గొన వచ్చని కాని ఆవేడుకల్లో రాజకీయపరమైన ప్రసంగాలు చేయరాదని సిఇఓ మీనా స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా,గిఫ్టులు,ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సిసిఏ నిబంధనలు ప్రకారం ఐపిసి సెక్షన్ 171 మరియు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఎ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఇఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.ఇంకా ఈసమావేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన పలు సందేశాలను సిఇఓ మీనా నివృత్తి చేశారు.

ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్,వై.శ్రీలక్ష్మి,కె.విజయా నంద్,వర్చువల్ గా యం.టి కృష్ణబాబు,అనంతరాము పాల్గొన్నారు.ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్,హరీశ్ కుమార్ గుప్త,ప్రవీణ్ ప్రకాశ్,సునీత,కాంతిలాల్ దండే,చిరంజీవి చౌదరి,వాణీ మోహన్,పలువురు కార్యదర్శులు,కమీషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments