15 ఏప్రిల్ నుండి 14 జూన్ వరకు సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం.




విజయవాడ (ప్రజా అమరావతి);


*15 ఏప్రిల్ నుండి 14 జూన్ వరకు సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం*


*61 రోజుల పాటు మెకనైజ్డ్, మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*


*నిషేధ ఉత్తర్వులను ధిక్కరించి సముద్ర జలాల్లోకి చేపల వేటకు వెళ్తే చట్ట పరమైన చర్యలు*


*నిషిద్ధ కాలాన్ని కచ్ఛితంగా అమలు చేసేలా మత్స్యశాఖ, కోస్ట్‌ గార్డ్, కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు*


*నిషేధ ఉత్తర్వులను అనుసరించి మత్స్య అభివృద్ధి సహకరించాలని విజ్ఞప్తి* 


:- *మత్స్యశాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి*


సముద్ర జలాల్లో మోటారు, సంప్రదాయ బోట్ల ద్వారా అన్ని రకాల చేపల వేటను ఈ నెల 15 నుండి 14 జూన్ వరకు 61 రోజుల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మత్స్యశాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సముద్ర జలాల్లో వివిధ చేప, రొయ్య జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించి వాటి సంతతిని ప్రోత్సహించడం ద్వారా సుస్థిరతను సాధించేందుకు మత్స్య సంపద వేటను నిషేధించడం ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. నిషేధ ఉత్తర్వులను ధిక్కరించి సముద్ర జలాల్లోకి చేపల వేటకు వెళ్తే చట్ట పరమైన చర్యలు (సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టం 1994 సెక్షన్‌ (4)ను అనుసరించి) తీసుకుంటామని, యజమానుల బోట్లను, బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీనపరుచుకొని, జరిమాన విధిస్తామన్నారు. ప్రభుత్వం అందించే డీజిల్ రాయితీ సహా అన్ని రకాల రాయితీలను నిలిపివేస్తామని వెల్లడించారు.


 సముద్ర జలాల్లో యాంత్రిక పడవలపై వేటకు వెళ్లే మత్స్యకారులు నిషేధ ఉత్తర్వులను అనుసరించి మత్స్య అభివృద్ధి సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. వేట నిషేధ కాలం సక్రమంగా అమలయ్యేలా మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేస్తున్నామని మత్స్యశాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు.





Comments