రికార్డు స్థాయిలో విజయం సాధించబోతున్న నారా లోకేష్.

 *రికార్డు స్థాయిలో విజయం సాధించబోతున్న నారా లోకేష్* *గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆహర్నిశలు శ్రమించారు*


*నారా లోకేష్ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు*


*కులమతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలు నారా లోకేష్‌కు ఓట్లు వేశారు* 


*అందరి ఆదరణ ఆశీస్సులతో త్వరలోనే కూటమి ప్రభుత్వం*


*అర్థరాత్రి వరకూ ఓటింగ్ జరగడమే ఇందుకు నిదర్శనం*


మంగళగిరి టౌన్, మే 15 (ప్రజా అమరావతి );మంగళగిరి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్‌ మంగళగిరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయి మేజార్టీతో విజయం సాధించబోతున్నారని నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య స్పష్టం చేశారు. బుధవారం టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నందం అబద్దయ్య మాట్లాడుతూ కులమతాలకు, పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలు నారా లోకేష్‌కు ఓట్లు వేశారని అన్నారు. నారా లోకేష్ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారులు, సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. నారా లోకేష్ గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆహర్నిశలు శ్రమించారన్నారు. రాత్రి, పగలు శక్తి వంచనలేకుండా కష్టపడ్డారని, అన్ని వార్డులు, గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలు నారా లోకేష్‌కు ఆదరణ చూపారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. గతంలో ఎప్పుడు ఓటు వేయని వారు, కొత్తగా ఓటు వచ్చిన వారు కూడా చంద్రబాబు నాయుడును సీఎం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. మంగళగిరిలో మొట్ట మొదటిసారి 85.74 శాతం పోలింగ్ నమోదు కావడం సంతోషించదగ్గ విషయమన్నారు. అందరి ఆదరణ ఆశీస్సులతో త్వరలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని వ్యాఖ్యనించారు. నియోజకవర్గంలో నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఓటు వేసేందుకు రాష్ట్రం నుంచే గాక తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిస్సా తదితర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఎంతో మంది స్వచ్చందంగా తరలి వచ్చారని, అర్థరాత్రి వరకూ ఓటింగ్ జరగడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అన్ని  రకాలుగా రాష్టాన్ని సర్వనాశనం చేశాడని ధ్వజమెత్తారు. నారా లోకేష్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్‌గా అభివృద్ధి చేస్తారని చెప్పారు.


రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించి ప్రజా సంక్షేమ పాలన కోసం పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ప్రభంజనంలా తరలివచ్చి కూటమికి ఓటు వేశారన్నారు. జగన్ ఐదేళ్లలో మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను అరకొర అమలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుందని అన్నారు. చంద్రబాబునాయుడు సీఎం అయితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకంతో ప్రజలు ఓటు వేశారన్నారు. కూటమి అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


జనసేన ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు మాట్లాడుతూ వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటును వినియోగించుకోవడం హర్షణీయమన్నారు. నారా లోకేష్ 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. నారా లోకేష్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తారన్నారు. కూటమి మేనిఫెస్టో పథకాలను పార్టీలకతీతంగా ప్రజలకు అందించేందుకు నారా లోకేష్ కృషి చేస్తారన్నారు. నారా లోకేష్ విజయానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేసినట్లు తెలిపారు. 


ఈ సమావేశంలో మంగళగిరి పట్టణ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, మంగళగిరి మండల పార్టీ అధ్యక్షులు తోట పార్థసారథి, పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, జనసేన ఎంటీఎంసీ కార్యదర్శి తిరుమలశెట్టి మురళీకృష్ణ, నియోజకవర్గ ఐటీడీపీ నాయకులు సుధీర్ తదితరలు పాల్గొన్నారు.

Comments