వెంటనే విధుల్లోకి చేరండి
అన్ని క్లినికల్ విభాగాల్లో 20 శాతం ఇన్ సర్వీస్ రిజర్వేషన్ ఇచ్చేందుకు సుముఖం
వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
పిహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో ఎపిఐఐసి టవర్స్‌లో ముగిసిన చర్చలు
అమరావతి, సెప్టెంబర్ 25 (ప్రజా అమరావతి);
వెంటనే విధుల్లోకి చేరాలని పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల్ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కోరారు. అలాగే క్లినికల్ విభాగంలో 15 శాతం ఇన్ సర్వీస్ రిజర్వేషన్ ను 20 శాతానికి పెంచుతామని మంత్రి స్పష్టం చేశారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లో బుధవారం పిహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో మూడో విడత జరిగిన చర్చలో మంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమీషనర్ సి.హరికిరణ్, డిహెచ్ డాక్టర్ పద్మావతి, డిఎంఇ డాక్టర్ నరసింహం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి పాల్గొన్నారు. చర్చల అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అన్ని బ్రాంచ్‌లలో 20 శాతం రిజర్వేషన్ పెంచడం వల్ల 258 సీట్లు పొందే అవకాశమేర్పడుతుందన్నారు. పీజీ ఇన్ సర్వీసులో జాయిన్ కాకముందు ఏ బ్రాంచ్ లో డిప్లమా చదివితే అదే బ్రాంచ్‌లో పీజీ చేయాలన్న జీఓ 85 లోని నిబంధనను సడలిస్తామని, దీంతో ఏ బ్రంచ్ లోనైనా పీజీ చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. అలాగే సర్వీసులోకి రాకముందు పీజీ చేసి ఉంటే ఇన్ సర్వీసులో రెండవ పీజీ చేసేందుకు అర్హత లేదన్న నిబంధనను కూడా సడలించి స్వంత ఖర్చులతో పీజీ చేసేలా జీఓను సవరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం పెద్ద మనసుతో జీఓ 85ను సవరించేందుకు గత చర్చల్లో ముందుకొచ్చిందన్నారు. ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్(2020 బ్యాచ్‌కు ) ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామన్నారు. పిహెచ్సీ డాక్టర్ల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున సమ్మె విరమించి పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తక్షణమే విధుల్లోకి చేరాలని మంత్రి కోరారు. ఈనెల 13, 18 తేదీల్లో జరిగిన చర్చల్లో కూడా పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. సంఘం ప్రతినిధులు తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారనీ, అయితే ప్రభుత్వానికున్న పరిమితులు, ఇబ్బందుల్ని కూడా అర్ధం చేసుకోవాలన్నారు. ఎటువంటి ప్రతిష్టంభన ఏర్పడకూడదన్న సదుద్దేశంతో చర్చల్ని సుహృద్భావ వాతావరణంలో జరిపామన్నారు. ఎటువంటి అపోహలకు తావులేకుండా పేదలకు డాక్టర్లు సేవలందించాలన్నారు. చర్చల్లో ఒకటి మాట్లాడి, బయటికెళ్లాక మరొకటి మాట్లాడే విధానానికి స్వస్తి పలకాలన్నారు.
అపోహలు, అసత్యాలకు తావులేకుండా సంఘం ప్రతినిధులు వ్యవహరించాలన్నారు. గత ప్రభుత్వంలోలా కాకుండా ఈ ప్రభుత్వం అన్ని విధాలా సానుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.
addComments
Post a Comment