నెల రోజుల్లోపే 1845 ఉపాధి హామీ పనులు పూర్తి
అమరావతి (ప్రజా అమరావతి);
పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా గత నెల అక్టోబర్ 14 -20 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకు ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. గ్రామీణ మౌలిక సదుపాయాలైన సిసి రోడ్లు, బిటి రోడ్లకు సంబంధించి 26,857 పనులకు ఆమోదం ఇవ్వగా ఈ పనులన్నీ ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. నవంబర్ 8 నాటికి దాదాపు 1686 పనులు పూర్తవ్వగా మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇప్పటికే పూర్తయిన రోడ్లను రాష్ట్ర మంత్రులు, ఎంఎల్ఎలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం ఇచ్చారు.
అలాగే వ్యక్తిగత పనులైన గోకులాలు, గొర్రెల షెడ్లు, కోళ్ళ షెడ్లకు సంబంధించి 22,525 పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందులో 159 షెడ్లు పనులు పూర్తయి లబ్ధిదారులకు అందుబాటులోకి రాగా మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు ప్రగతిలో ఉన్న పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు క్వాలీటీ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు విఆర్ కృష్ణతేజ మైలవరపు ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఆకస్మిక పర్యటనలు చేసి, పనుల ప్రగతి, నాణ్యతను పరిశీలించారు.
ఇదే వేగంతో సంక్రాంతి పండుగ లోపు పల్లె పండుగ వారోత్సవాల్లో భూమి పూజ జరుపుకున్న పనులు అన్నింటిని పూర్తి చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు.
addComments
Post a Comment